Followers
Thursday, 8 November 2018
కార్తీక శుద్ధ విదియ రోజు 09_11_2018
భగినీహస్త భోజనం... కార్తీక శుద్ధ విదియ రోజున సోదరి చేతివంట తినడం ఆచారం. ఆమె ఏ ఊళ్ళో ఉన్నా అక్కడకు వెళ్లి, ఆమె వండిన పదార్ధాలు ఆరగించాలని శాస్త్రం. ఈ రోజు సోదరులు అక్కాచెల్లెళ్ళ చేతి వంటను తిని, వారికి వస్త్రాలంకారాలు సమర్పించాలి. దీని వల్ల ఉభయులకూ ధనధాన్య లాభాలు ప్రాప్తిస్తాయి. సోదరికి సౌభాగ్యవృద్ధి, సోదరుడు దీర్ఘాయుష్షు పొందుతాడు. యమో యమునయా పూర్వం భోజితస్వగృహే స్వయం! అతోయమి ద్వితీయా సా ప్రోక్తాలోకే యుధిష్టరః!! "భగిని" అంటే తోబుట్టువు అయిన సోదరి అనీ, భాగ్యవంతురాలు అనీ అర్ధం. సోదరి చేతి వంటని తినడం భగినీ హస్త భోజనం. ఈ సంప్రదాయానికి ఎంతో విశిష్టత ఉంది. యమధర్మరాజు సోదరి యమునానది. ఆమె పూర్వం తన అన్న అయిన యమధర్మరాజు దగ్గరకు ప్రతిరోజు వెళ్లి, తన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరేదట. నరకలోక పాలనలో సతమతమైపోయే యమునికి సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేయడానికి ఎన్నాళ్ళకు తీరిక దొరకలేదు. ఎలాగైనా ఒక దినాన చెల్లెలి ఇంటికి వెళ్లి భోజనం చేసి రావాలని సంకల్పించుకున్నాడు. చివరికి అతనికి కార్తీకమాసం, శుక్లపక్షం, ద్వితీయాతిధినాడు విరామం దొరికింది. ఆ దినాన యమునా ఇంటికి వెళ్ళాడు. ఎన్నాళ్లో ఎదురుచూడగా అనుకోకుండా వచ్చి, తన ప్రార్ధనను మన్నించిన అన్నకు యమున షడ్రసోపేతమైన విందు భోజనం వడ్డించింది. సోదరి భక్తితో చేసిన వంటలన్నీ చక్కగా ఆరగించాడు. అమృతాన్ని తాగిన ఆనందం కలిగింది. అప్పుడు యముడు తన చెల్లెలి చేతివంటను మెచ్చుకొని , ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడామె 'అగ్రజా! నీవు ప్రతి సంవత్సరం ఇదే రోజున నా ఇంటికి వచ్చి నా చేతి వంటని తిని వెళ్ళాలి, అంతేగాక, ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ విదియనాడు లోకంలో ఏ అన్నలు చెల్లెళ్లు వండిన పదార్ధాలను భోజనం చేస్తారో, అలాంటివాళ్ళకు నరకబాధ ఉండరాదు, ఇదే నేను కోరే వరం' అని పలికింది. యముడు 'తధాస్తు' అన్నాడంటారు. నాటి నుంచి ఈ వేడుక 'యమ ద్వితీయ' అనీ, 'భాతృద్వితీయ' అని ప్రసిద్ధి లోకి వచ్చింది.
____Manoj kankatala
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment